ప్రభుత్వం ఉద్యానంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో తోటలు పెద్దఎత్తున సాగవుతున్నాయి. ఒక్క మామిడి తోటలే 3 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. కొత్త రకాలు, సాగు పద్ధతులు రైతులకు అందించేందుకు సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కృషి చేస్తోంది. అకాల వర్షాలు, వడగండ్లు తదితర ప్రతికూల పరిస్థితులు తట్టుకొని అధిక దిగుబడులిచ్చే స్వల్పకాలికమైన 17 మామిడి రకాలపై ప్రయోగాత్మక పరిశోధనలు చేస్తున్నారు.
ఇప్పటికే 75 వేల మొక్కల విక్రయం..
బంగినపల్లి, హిమాయత్, కేసరి, దశేరి రకాలను సైతం తక్కువ ధరల్లో విక్రయిస్తున్నారు. 2017 నుంచి ఈ సంస్థ మామిడి అంట్లు, మొక్కలు సిద్ధం చేసి ఉద్యాన శాఖ ద్వారా రైతులకు సరఫరా చేస్తోంది. గత రెండేళ్లలో 75 వేలకుపైగా మొక్కలు విక్రయించగా.. ఈ ఏడాది ఇప్పటివరకే 75 వేల మొక్కలు అమ్మింది. హిమాయత్, కేసరి రకాలపై రైతులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పునాస రాయల్ స్పెషల్ రకం వేస్తే ఏడాదిలో రెండు పంటలు తీసుకోవచ్చని ఉద్యానాధికారులు సూచిస్తున్నారు.
అదే సంస్థ ప్రత్యేకత..
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రెయిజ్డ్ బెడ్‌పై మొక్కలు నాటడం ప్రత్యేకత. రెండు అడుగులు భూమిపైకి లేపి మొక్క వేయడం వల్ల సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అందుతాయి. సూక్ష్మ సేద్యం కింద పైపుల ద్వారా ఎప్పటికప్పుడు నీరందిస్తుంటారు. అవసరమైన ఎరువులు, పురుగు మందులు నేరుగా మొక్కలకు అందిస్తుండటం వల్ల ఏపుగా పెరుగుతాయి. నాణ్యమైన మంచి కాపు ఇస్తాయి. ఫ్రూనింగ్ సహా చెట్లపై రక్షణ కోసం బ్యాగ్ కవర్లు వేసి కాయలు పండిస్తున్నారు. గిరాకీ దృష్ట్యా రాబోయే ఏడాది కోసం లక్ష మొక్కలు ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇంటి ముంగిటకే..
కరోనా వల్ల మామిడి పండ్లు కిలో 40 నుంచి 60 రూపాయలకు తోటల వద్దే రైతులు విక్రయిస్తున్నారు. కొందరు యువకులు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు బుక్ చేసుకొని వినియోగదారుల ఇంటి ముంగిటకే చేరుస్తూ ఆదాయం పొందుతున్నారు.
ఇవీచూడండి: కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం