సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వైశ్య భవన్లో భాజపా ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు వస్త్రాల పంపిణీ ఏర్పాటు చేశారు. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ముఖ్య అతిథిగా హాజరై.. వస్త్రాలను పంపిణీ చేశారు.
కరోనా సంక్షోభంలో పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు చేసిన సేవలు ఎనలేనివని గీతా మూర్తి పేర్కొన్నారు. వారికి చిరు కానుకగా చీరలు పంపిణీ చేసి.. సత్కరించుకున్నట్లు వివరించారు. ఇలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చాలా మందికి భాజపా అండగా నిలిచిందని గీతామూర్తి పేర్కొన్నారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు కరోనా వారియర్స్‌ను ఎక్కడికక్కడ గుర్తించి సత్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా భాజపా అధ్యక్షుడు దూది శ్రీకాంత్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ చాడ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.