సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షలు, టీకా వేయించుకోవడానికి వచ్చిన వారు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారు భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లో వేచి చూడకుండా గుంపులు గుంపులుగా ఒకే దగ్గర చేరుతున్నారు. దీంతో వ్యాధి ఉన్న వారితో పాటు లేని వారికి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిట్ల కొరతతో ఆస్పత్రిలో పలుమార్లు పరీక్షలు నిలిపివేస్తుండటంతో మరుసటి రోజు పరీక్షల కోసం వచ్చే వారితో రద్దీ పెరుగుతోంది. టీకా కోసం వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉంటున్నారు.
సాంకేతిక సమస్యలు..
సాంకేతిక కారణాల వల్ల ఆస్పత్రిలో వారానికి రెండు, మూడు రోజులు వ్యాక్సిన్లు వేయడం లేదు. టీకాలు వేస్తున్న రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం, ఆస్పత్రిలో నమోదు చేసుకున్న వరుస సంఖ్యల ప్రకారం టీకాలు వేస్తుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఏదేమైనా దీని వల్ల ఆస్పత్రిలో రద్దీ పెరుగుతుండటంతో అటు ఆరోగ్యంగా ఉన్న వారూ కరోనా బారిన పడే అవకాశముంది. ఆస్పత్రి సిబ్బంది కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ వ్యాక్సినేషన్, నిర్ధరణ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముంది.
ఇదీ చదవండి: ప్రజల్లో కరోనా భయం.. మందులకై ముందు జాగ్రత్త!!