దుబ్బాక ఉపఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి బండారు శ్రీకాంత్ రావులు ప్రచారం నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి, రామ్‌సాగర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించాక ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నా తెరాస... కనీసం గ్రామానికో ఉద్యోగమైనా ఇవ్వలేదని శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇంటికో ఉద్యోగం సాధించాలంటే తెరాస పాలనలో ఇంకో 200 సంవత్సరాలు పడుతుందన్నారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా... గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదంటే ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గుపడాలన్నారు. ఉద్యోగాలను కల్పించకుండా ఉన్న ఉద్యోగులను తెరాస తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేసిన క్షేత్ర సహాయకులను ప్రభుత్వం తొలగించిందని... ఇందుకేనా తెలంగాణను సాధించుకున్నామంటూ ప్రశ్నించారు.
ఉపఎన్నికలో తెరాస, భాజపాలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరను కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి పండిస్తున్న రైతులకు కనీసం కూలీల ఖర్చు కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ ఉపఎన్నిక తెరాసకు మేలుకొలుపు కావాలని సూచించారు.
ఇవీ చూడండి: అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి కేటీఆర్