సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.. కానీ కొందరు నేతల్లో రాష్ట్ర నాయకత్వం నిర్ణయంపై అంతర్మథనం మొదలైంది. గ్రామాల వారీగా ప్రణాళికలు రూపకల్పన చేసుకుని, గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నా.. కొందరిలో పార్టీ అభ్యర్థి ఓటమి చెందితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికార తెరాస సిట్టింగ్ స్థానంలో పోటీ చేస్తూ.. వారిని ఢీకొట్టేందుకు పెద్ద ఎత్తున సమయం కేటాయించడం అవసరమా అన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థి ఓటమి చెందితే దాని ప్రభావం వరుసగా రానున్న ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన కొందరి నాయకుల్లో వ్యక్తమవుతోంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు మరణించినప్పుడు.. ఏకగ్రీవానికి తెరాస సహకరించలేదనే కారణంతో.. తమ అభ్యర్థిని బరిలో నిలిపినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు, తెరాస నాయకుడు చెరకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆయన్నే దుబ్బాక అభ్యర్థిగా బరిలోకి దించారు.
ఆ ఒక్క స్థానం గెలవడం ద్వారా... అటు కాంగ్రెస్, తెరాస, భాజపాకు వచ్చే ఫలితం ఏం లేకపోయినా.. ఎలాగైనా అక్కడ పాగావేసేందుకు ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తమదే గెలుపు అన్న ధీమాతో పనిచేస్తున్నాయి.
కాంగ్రెస్‌లో ఎన్నడూ లేని విధంగా..
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్కం ఠాగూర్.. పలుసార్లు దుబ్బాక ఉప ఎన్నికపై సమీక్షలు నిర్వహించారు. పార్టీ యంత్రాంగం అంతా ఉప ఎన్నికపైనే పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. గత రెండు వారాలుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీనియర్ నేతలంతా అక్కడే మకాం వేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా ఓటర్లను ఆకర్షించేందుకు విశేషంగా కృషిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి చేరి.. తెరాసను ఢీకొట్టేందుకు ఎత్తులు.. పైఎత్తులు వేస్తోంది.
కాంగ్రెస్ నేతల ఆందోళన..
దుబ్బాకలో గెలిచి.. రానున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థల్లోనూ పాగావేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో పని చేస్తోంది. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై కొంత మంది సీనియర్లు మాత్రం అంతర్గతంగా మథనపడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ గెలిచినా.. ఓడినా.. వచ్చేది, పోయేది ఏం ఉండదని అలాంటి సమయంలో రాష్ట్ర నాయకత్వం మొత్తం దృష్టిసారించడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రతికూల ఫలితాలు వస్తే.. ఆ ప్రభావం రానున్న ఎన్నికలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికే దుబ్బాక బాధ్యతలు అప్పగిస్తే బాగుండేందని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశాల్లో కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న సమయంలో రెండో ఆలోచనకు తావులేదని స్పష్టం చేసినట్లు సమాచారం. యుద్ధభూమిలోకి దిగిన తర్వాత చావోరేవో తేల్చుకోవాల్సి ఉంటుందని అధైర్య పడాల్సిన పనిలేదని సూచించినట్లు సమాచారం.
తెరాస.. భాజపా..
అధికార తెరాస.. దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించింది. హరీశ్ సహా స్థానిక పార్టీ కేడర్ అంతా.. రామలింగారెడ్డి సతీమణి సుజాత.. విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు కోసం ఆ పార్టీ నేతలు కృషిచేస్తున్నారు.
ఇవీచూడండి: హోరాహోరీగా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం... బరిలో 23 మంది