దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్‌ను కంగు తినిపించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు ఈ చేదు ఫలితాలు ఆ పార్టీకి మింగుడుపడటంలేదు. దుబ్బాకలో మూడో స్థానానికి పరిమితం కావడమే కాకుండా అక్కడ భాజపా విజయం సాధించడం కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా గెలవాలని, లేదంటే రెండో స్థానంలోనైనా నిలవాలని సర్వశక్తులు ఒడ్డినా ధరావతు దక్కక పోవడం ఆ పార్టీ నేతల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. బలమైన అభ్యర్థిగా మాజీమంత్రి, దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని బరిలో దింపడంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలంతా అక్కడే మకాం వేసి ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. దుబ్బాకలో ఇప్పటివరకు జరిగిన నాలుగు శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు మొదటిసారి అతి తక్కువ ఓట్లు వచ్చాయి.
ముఖ్యంగా తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ నేతలకు భాజపా గెలుపు కలవరపెడుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందని, పార్టీ నేతలు డీలాపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భాజపా నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలిచినప్పుడే అప్రమత్తమై ఉండాల్సిందని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాల్లో భాజపా సత్తా చాటడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని వారు భావిస్తున్నారు. భాజపా కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు 2023 ఎన్నికలకు ఈ ఫలితాలు కీలకంగా మారవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
నేతలంతా శ్రమించినా నిష్ఫలం
తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని బలమైన అభ్యర్థిగా భావించి కాంగ్రెస్ అక్కడ నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌ఛార్జీగా మాణికం ఠాగూర్ నియమితులైన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నిక కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన దీనిపై ప్రత్యేకదృష్టి సారించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సహా ముఖ్యనేతలను మండల ఇన్‌ఛార్జులుగా నియమించారు. బూత్‌స్థాయి, గ్రామస్థాయిలోనూ బాధ్యతలు అప్పగించారు. మాణికం ఠాగూర్ సహా ముఖ్యనేతలంతా ప్రచారంలో పాలుపంచుకున్నారు. అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి నేతలంతా దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారం చేసినా ఫలితం దక్కకపోగా రెండు స్థానంలో కూడా నిలవలేకపోయింది.