ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాలపై సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర పోషించాలని సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి భారతి హోళికేరి ఆదేశించారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా భారత ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు విచ్చేసిన దుబ్బాక ఉప ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎన్నికల పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలించి, నిస్పక్షపాతంగా ఎన్నికలపై సమాచారం, ప్రతిచోట ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించి ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాలని సూచించారు.
ఎన్నికలు సజావుగా జరిగాయా లేదా అనే విషయాలపై పర్యావేక్షకులు, అబ్జర్వర్లు తెలపాలని కోరారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకుటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయడానికి, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ రోజున బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల కోసం 58 మైక్రో అబ్జర్వర్లను నియమించారని వివరించారు.
ఇదీ చూడండి : బిహార్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం