ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండు ముఖం పట్టిన పంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవధారాలు అందించనున్నారు. కొండపోచమ్మ జలాశయంపై నిర్మించిన సంగారెడ్డి కాలువ ద్వారా హల్దీ వాగులోకి నీటిని విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం పదిన్నర గంటలకు అవుసులపల్లి వద్ద నీటిని విడుదల చేయనున్నారు. అవుసులపల్లి నుంచి మొదట వర్గల్‌లోని బంధం చెరువుకు నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్ద చెరువు.. శాఖారంలోని ధర్మాయ చెరువు.. అనంతరం అంబర్ పేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఖాన్‌చెరువు నుంచి హల్దీవాగులోకి.. హల్దీ నుంచి మంజీర నదిలోకి... అక్కడి నుంచి నిజాంసాగర్‌కు గోదావరి జలాలు చేరనున్నాయి. 11 గంటల15నిమిషాలకు మర్కుక్ మండలంలోని పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువలోకి నీటిని వదులుతారు. గజ్వేల్ కాలువ ద్వారా మర్కుక్, గజ్వేల్ మండలాల్లోని 19చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి.
హల్దీ వాగులోకి నీటి విడుదలతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో తక్షణం 14వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందనుంది. ప్రస్తుతం నిజాంసాగర్ లో 7.2టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి 1.2టీఎంసీలు విడుదల చేయనున్నారు. హల్దీ వాగు ద్వారా మరో 4టీఎంసీల నీటిని అందించనున్నారు. దీంతో నిజాంసాగర్‌లో మొత్తం నీటి నిలువ పది టీఎంసీలకు చేరుకుంటుంది. వచ్చే వర్షకాలంలో వానలు సకాలంలో రాకపోయినా.. ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అవుసులపల్లి, పాములపర్తిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఆ యాప్‌తో 33 రకాల వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు'