సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొండపాక మండలం దుద్దెడలో ఐటీ పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. 45 కోట్ల రూపాయల వ్యయంతో దుద్దెడలో ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనున్నారు. రెండు వేలమందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేటకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న సిద్దిపేటలో అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు త్వరలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాల కోసం సీఎం సమక్షంలో నాలుగు ఐటీ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.
శంకుస్థాపనలు
దుద్దెడలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన తర్వాత.. పొన్నాలలో తెలంగాణ భవన్‌ను ప్రారంభించారు. మిట్టపల్లిలో రైతు వేదికను సీఎం ప్రారంభించారు. ఎన్సాన్‌పల్లిలో 51 వేల 772 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం 960 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం కోమటిచెరువు వద్ద కొత్తగా నిర్మించిన నెక్లెస్ రోడ్డును ముఖ్యమంత్రి పరిశీలించారు. చెరువు సుందరీకరణ పనులను స్వయంగా పరిశీలించారు. సిద్ధిపేట జిల్లా కేసీఆర్‌నగర్‌లో దేశంలోనే మరెక్కడ లేని విధంగా... 163 కోట్లు వెచ్చించి.. 34 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన.. 2,460 రెండు పడకగదుల ఇళ్లను మఖ్యమంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులతో కేసీఆర్ ముచ్చటించారు.
చింతల్‌చెరువు వద్ద తొలివిడత భూగర్భ మురుగుపారుదల వ్యవస్థ ప్రారంభం కానుంది. చింతల్‌చెరువు వద్ద మురుగుశుద్ధి ప్లాంటును సీఎం ప్రారంభించనున్నారు. రంగనాయకసాగర్ అతిథిగృహాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్... మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.