లాక్డౌన్ కాలంలో కార్మికులు, రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని... వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీఐటీయూ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.
వివిధ రంగాల్లో పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఆరు నెలల పాటు రూ.7500 ఇవ్వాలని కోరారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. హుస్నాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా... పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని నాయకులు కోరారు.