ఇక్కడ కనిపిస్తున్న చిన్నారుల పేర్లు వైష్టవి, వాసవి. వీరి అమ్మనాన్నలు శ్రీనివాస్, సుగుణ. సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన వీరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవించేవారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లో అనారోగ్యం రూపంలో కష్టాలు మొదలయ్యాయి. చిన్నారుల తల్లి సుగుణ జూన్ 2017లో చనిపోయింది. నెలరోజుల్లోనే తండ్రి కూడా మరణించాడు. దీనితో చిన్నారుల బాధ్యతను వారి నాన్మమ్మ ఐలమ్మ తీసుకుంది. ఒక్కగానొక్క కొడుకుతోపాటు కోడలు చనిపోయినా.. బాధను దిగమింగి మనుమరాళ్లను సాకింది. చదువులకు ఆటంకం కలగొద్దనే ఆలోచనతో కస్తూర్భాగాంధీ పాఠశాలలో చేర్చి వారిని చదివిస్తోంది.
వంచించిన విధి
తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులను విధి మరోసారి వంచించింది. అమ్మానాన్న లేకుండా చూసుకుంటున్న నాన్మమ్మను దూరం చేసింది. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఐలమ్మ ఆదివారం సాయంత్రం చనిపోయింది. దీనితో చిన్నారులు అనాథలుగా మారిపోయారు. 14సంవత్సరాల వైష్ణవే తన తల్లిదండ్రులకు.. నానమ్మకు కర్మకాండలు నిర్వహించింది.
అనాథలుగా మారిన చిన్నారులు
బంధువులు, గ్రామస్థులు చందాలు వేసుకుని ఐలమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల బంధువుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో వీరి బాధ్యత ప్రశ్నార్థకంగా మారింది. తన పనులే తాను చేసుకోలేని వైష్ణవి.. తన చెల్లి సంరక్షణ చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలవాలని బంధువులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వంతోపాటు మనసున్న మహారాజులు స్పందిస్తే.. ఈ చిన్నారుల భవిష్యత్తుకు భరోసా దొరుకుతుంది.
ఇదీ చూడండి:- హాంకాంగ్ నిరసనలు... మాస్క్‌లతో మానవహారం