నువ్వా-నేనా అన్నట్లు సాగిన దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో భాజపా అనుహ్య విజయం సాధించింది. రౌండ్ రౌండ్‌కి ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌ను తలపించేలా ఫలితాలు వెలువడ్డాయి. హోరాహోరీ పోరులో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. 23 రౌండ్లుగా వెలువడిన ఫలితాల్లో ముందు ఐదు రౌండ్లలోనూ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యం ప్రదర్శించారు. ఆ తర్వాత తెరాస కొద్దిగా పుంజుకుంది. అయినా భాజపానే ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత వరుస రౌండ్లలో గులాబీ సత్తా చాటింది. అయితే ఆధిక్యాలు భారీ స్థాయిలో చేజిక్కుంచుకోలేకపోయింది.
అనూహ్య ఓటమి
భాజపా అభ్యర్థికి కొన్ని రౌండ్లలో వెయ్యికి పైగా ఆధిక్యాలు దక్కాయి. తెరాసకు మాత్రం ఏ రౌండ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో మెజార్టీ రాలేదు. ప్రతి రౌండ్‌లోనూ కేవలం వందల్లోనే మెజార్టీల్లో తేడాలు వచ్చాయి. చివరి నాలుగు రౌండ్లలో కమలదళం సత్తా చాటింది. తెరాస అభ్యర్థి సుజాతకు 61,302 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 21,819 ఓట్లు సాధించారు. 62,772 ఓట్లు సాధించి... 1,470 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయదుందుభి మోగించారు. ఉపఎన్నికల ఫలితాల్లో తెరాస అనూహ్యంగా ఓటమి చవిచూసింది.
7 రౌండ్లలో తెరాస ఆధిక్యం
మొత్తం 23 రౌండ్లలో భాజపా 12 రౌండ్లలో ఆధిక్యం చూపగా.. తెరాసకు 10 రౌండ్లలో మెజార్టీ దక్కింది. 12వ రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం చూపింది. తొలి ఐదు రౌండ్లతో పాటు ఎనిమిది, తొమ్మిది, 11వ రౌండ్‌లో కమలం ఆధిపత్యం చూపింది. తరువాత అనూహ్యంగా పుంజుకున్న తెరాస ఆరు, ఏడు, పది, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, 19వ రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించింది. మళ్లీ 20, 21, 22, 23 రౌండ్‌లో భాజపా పుంజుకుంది. తొలి ఐదు రౌండ్లలో వరుసగా భాజపాకు మెజార్టీ దక్కగా.. 13 వ రౌండ్ నుంచి వరుసగా ఏడు రౌండ్లలో తెరాస ఆధిక్యం చూపింది. 23 రౌండ్ల ఫలితాల్లో.. కమళదలం 12 రౌండ్లలో ఆధిక్యం చూపి విజయం సాధించింది.