komuravelli mallanna kalyanam : నేడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం జరగనుంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరుగుతుంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహం జరుగుతుంది. వధువు తరుఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరిస్తారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభం అవుతాయి.
వేకువజామునుంచే షురూ..
komuravelli mallanna Brahmotsavam :తెల్లవారుజాము నుంచే కల్యాణ క్రతువు ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకు దృష్టికుంభం, బలిహరణం నిర్వహించారు. గర్భాలయం నుంచి ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక మీదకు తీసుకువస్తారు. ఇవాళ ఉదయం 10.00 గంటలకు కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటలకు రథోత్సవం జరుపుతారు.
ప్రత్యేక ఏర్పాట్లు
komuravelli mallanna Siddipet : రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న కల్యాణం తిలకించడానికి వస్తారు. సుమారు 50వేల మంది వస్తారని అధికారులు అంచనా. ఇప్పటికే ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్కు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఉచితంగా పంపిణీ చేయడానికి మాస్కులు సిద్ధం చేశారు. ఆలయ సిబ్బందికి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించారు. భక్తుల కోసం దేవాలయం వద్ద ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు.
ఆదివారం ఉదయం 10గంటలకు స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఈ వేడుకకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తాం. అధికారులందరూ టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కూడా నిర్వహిస్తాం. ప్రత్యేక ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేశాం.
- బాలాజీ, ఆలయ ఈవో
మల్లన్న భక్తుల సౌకర్యం కోసం సిద్దిపేట, గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Yadadri temple rush: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కోలాహలంగా ఆలయ పరిసరాలు