Zaheerabad Children's Festival : కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస చిన్నారులకు అమితంగా ఉంటుంది. వారిలోని ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు. ర్యాంకులు, మార్కులే కాకుండా '' ఆడుతూ, పాడుతూ, ఆనందంగా.. ఎదుగుదాం..'' అనే నినాదంతో జహీరాబాద్‌లో పిల్లల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్రలేఖనం, కథారచనలు, మట్టి, పలు రకాల వ్యర్థాలతో బొమ్మలు చేసిన చిన్నారులు చూపరులను ఆకట్టుకున్నారు.
మరోవైపు పాటలు, నృత్యాలు, రైతు, వెంకటేశ్వర స్వామి తదితర వేషధారణతో అబ్బురపరిచారు. సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, వాతావరణ స్థితిగతులను ఎంచక్కా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆనందాన్ని వెలిబుచ్చారు. మరోవైపు నిత్యం చదువులతో కుస్తీ పట్టే పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు రీఛార్జ్లా పని చేస్తాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
"సుమారు 100 ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలు ఈ పండుగకు హాజరయ్యారు. రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు ఈ కార్యక్రమంలో తమలోని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పిల్లలకు ర్యాంకులు, మార్కులే కాకుండా ఆట పాటలు కూడా నేర్పించేలా తల్లిదండ్రులు కృషి చేయాలి. చదువులతో పాటు ఆటపాటలు, మానసిక ఉల్లాసాన్నిచ్చి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. రోజువారి చదువు ఒత్తిడి నుంచి కొంత ఉపశమనాన్ని, విద్యార్థుల్లోని ఉత్తేజాన్ని బయటకు తీసేందుకే ఏటా ఈ పిల్లల పండుగ నిర్వహిస్తున్నాం.'' - డా. విజయలక్ష్మీ, కన్వీనర్, పిల్లల పండుగ ట్రస్టీ
Zaheerabad Children's Fest : విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉండాలని ఉపాధ్యాయులు ఇప్పటికే సూచిస్తున్నారు. తరగతి గదిలో చెప్పే పాఠాల కంటే ప్రయోగాత్మకంగా వివరించటం ద్వారా మరింతగా ఆకలింపు చేసుకునే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులకు గల కారణాలు, మానవ శరీర అవయవాల పనితీరు వంటి అనేక అంశాలను విద్యార్థులు చక్కగా వివరిస్తున్నారు. దీనికి ముందుగానే ఆయా పాఠశాలల యాజమాన్యాలు చిన్నారులు ఎంచుకున్న అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి స్టాల్స్ ఏర్పాటు చేయించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విషయ పరిజ్ఞానంతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకత బయటకొస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
రోజువారి చదువు ఒత్తిడి నుంచి కొంత ఉపశమనాన్ని, విద్యార్థుల్లోని ఉత్తేజాన్ని బయటకు తీసేందుకే పిల్లల పండుగ నిర్వహించామని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అందరూ కలిసి పనిచేసేలా బృంద స్ఫూర్తిని అలవరచుకుంటారని వివరిస్తున్నారు. చదువులతో పాటు ఆటపాటలు, మానసిక ఉల్లాసాన్నిచ్చి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. చిన్నారులకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోనిస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది.
పిల్లలకు కథలు చదివి వినిపించిన తల్లిదండ్రులు- చైనా రికార్డ్ బ్రేక్