దేశంలోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మైత్రీ మైదానంలో మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ క్రీడా పోటీలను ఎంపీ ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్లమెంటులో, అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించాలని ఆమోదం తెలిపింది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంపీ పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వపరంగా పారిశ్రామిక, ఉద్యోగ, రాజకీయాల్లో అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచిందని తెలిపారు. అందుకే మహిళలు ముందజలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు, క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్‌తో పండుగ వాతావరణం నెలకొందని హర్షం వ్యక్తం చేశారు.
మహిళా సాధికారతకు కృషి..
నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అని భూపాల్ రెడ్డి కొనియాడారు. మహిళలకోసం నియోజకవర్గ స్థాయిలో క్రీడాపోటీలు ఏర్పాటుచేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. క్రీడారంగంవైపు మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వీటి నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని జడ్పీ ఛైర్‌పర్సన్ పేర్కొన్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: సీబీఐటీ విద్యార్థుల జోష్... వేడుకల్లో అల్లరి నరేశ్