మద్యం దుకాణాలు తెరవడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల సంగారెడ్డి జిల్లాలోని మద్యం షాపుల ముందు మద్యం ప్రియలు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే దుకాణాలు వద్ద నిరీక్షించారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించిన వారికే మద్యం విక్రయించారు.
జోగిపేట్..
జోగిపేటలో మద్యం ప్రియులు ఉదయం నుంచే మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. ఆయా దుకాణాల ముందు భౌతిక దూరాన్ని పాటించేలా సర్కిళ్లు ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మాస్కులు ధరించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని మద్యాన్ని విక్రయిస్తున్నారు. జోగిపేట ఎక్సైజ్ శాఖ సీఐ సుబ్రహ్మణ్యం ఆయా దుకాణాలను పర్యవేక్షించారు.
నారాయణఖేడ్....
వైన్ షాపులు తెరుచుకోవడంతో నారాయణఖేడ్‌లో మద్యం ప్రియుల ఆనందానికి అవధుల్లేవ్. ఉదయం నుంచే షాపుల ముందు మందుబాబులు నిరీక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ.. కొనుగోలు చేశారు. డివిజన్ పరిధిలోని మొత్తం ఎనిమిది మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. పట్టణంలో మద్యం దుకాణాలకు మహిళలు సైతం వచ్చారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే తక్షణమే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
డివిజన్‌లోని తడ్కల్ వైన్ వద్ద విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. భౌతిక దూరం పాటించేందుకు వైన్స్ నిర్వాహకులు వృత్తాలు గీశారు. అయితే వృత్తాల్లో తమ చెప్పులు, నీటి సీసాలు అక్కడ పెట్టిన అందరు వెళ్లి మద్యం దుకాణాం ముందు ఒకే చోట గుమిగూడారు.
సంగారెడ్డి...
సంగారెడ్డిలో ఉదయం నుంచే వైన్స్ షాపుల ముందు మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.
జహీరాబాద్...
జహీరాబాద్ పట్టణంలోని 9 మద్యం దుకాణాల ఎదుట ఉదయం నుంచి మద్యం ప్రియులు భారీ క్యూ లైన్లు కట్టారు. జహీరాబాద్ బస్టాండ్ పరిసరాల్లోని మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ భారీగా కనిపించింది. దుకాణాల వద్ద ఎక్సైజ్ శాఖ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ... మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారుగా పది మద్యం సీసాలు కొనుగోలుకు అనుమతిస్తున్నారు. మందు ప్రియులు భౌతిక దూరం పాటించి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: గ్రామాలు, మండల కేంద్రాల్లో అన్ని దుకాణాలకు అనుమతి