ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దాదాపు 40 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. మెతుకు సీమ వరప్రదాయిని మంజీర ఎండిపోయి మైదానంగా మారింది. కనీస అవసరాల కోసం ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డిజిల్లాలో 949 ఆవాసాలుండగా వాటిలో 335 ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. 167 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, 191 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. 725 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారుల చెబుతున్నా వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 250 పైగా గ్రామాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. మంజీర నది పరివాహక ప్రజలు నదిలో చెలిమలు తవ్వి అందులో ఊరిన నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు.
రోజంతా పడిగాపులు
కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా అవి కనీస అవసరాలు తీర్చడంలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి మూడు బిందెలకు మించి నీరు దొరకని పరిస్థితి. మైళ్ల దూరం నడిచి వ్యవసాయ బావుల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు.
వాటితోనే అన్నీ...
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు తమ జీవన శైలినే మార్చుకుంటున్నారు. సంగారెడ్డిలో పట్టణవాసులు అపార్టుమెంటుల్లో తొట్టెలు ఏర్పాటు చేసుకుని అందులోనే స్నానం చేసి ఆ నీటినే ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి కష్టాలు వర్ణణాతీతం.. నీరు లేక ఆసుపత్రులు మూతపడే స్థితికి వచ్చాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు నీటి కష్టాలతో సతమతమవుతున్నారు.
ఇదీ చదవండి: 'ఏంటయ్యా... వేసవి అయిపోయాక నీరిస్తారా?'