Villages Celebrates Girl Child Birth : సంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆడపిల్లల మీద సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేలా తమవంతు కృషి చేస్తున్నాయి. ఆడపిల్ల పుట్టిన సందర్భానికి గుర్తుగా పంచాయతీ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. గ్రామవాసులంతా ఒకచోట చేరి మిఠాయిలు పంచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారి పేరిట సుకన్య సమృద్ధి యోజన కింద పొదుపు ఖాతాలు తెరిపిస్తున్నారు. తొలి నాలుగు నెలలపాటు చెల్లించాల్సిన కిస్తీలు పంచాయతీ నుంచి అందిస్తున్నారు. ఇందుకోసం దాతల సాయం తీసుకుంటున్నారు. హరిదాస్‌పూర్‌లో మొదలైన ఈ కార్యక్రమం ఎద్దుమైలారం, శివన్నగూడెం, దొబ్బకుంట, పాశమైలారం గ్రామాలకు విస్తరించింది.
Shivannagudem Celebrates Girl Child Birth : ఇటీవల శివన్నగూడెంలో 37మంది బాలికల పేరిట పొదుపు ఖాతాలు తెరిచారు. జిల్లా అధికారులు, దాతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఖాతా పుస్తకాల్ని వారికి అందించారు. బాలిక విద్య ప్రాధాన్యాన్ని చిన్నారుల తల్లులకు వివరించారు. ప్రతి నెల తప్పనిసరిగా వారి పేరిట పొదుపు చేసేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాశమైలారానికి చెందిన గోపాల్ రెడ్డి.. తమ ఊరిలోనూ ఆడపిల్ల పుడితే తనవంతుగా ఆ కుటుంబానికి 5వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు.
Girl Child Birth Celebrations : బాలికల భవిష్యత్తుకు చేయూతనిచ్చేలా జిల్లాలో ఒక్కొక్కటిగా గ్రామాలు ముందుకు వస్తుండడంతో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'ఆడిపిల్ల పుడితే ఊరంతా పండుగే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో ఆడపిల్లలు పుట్టిన ప్రతి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ఆ బాలికల భవిష్యత్ బాగుండేలా చేయూతనందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాతలు సహకారం అందిస్తున్నారు.'
- శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాధికారి
Girl Child Birth Celebrations in Sangareddy : 'ఈ కార్యక్రమంలో భాగంగా శివన్నగూడెంలో 36 మంది బాలికల కోసం వేయి చొప్పున సుకన్య పథకంలో భాగంగా జమ చేశాం. మా ఊరు పాశమైలారంలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా.. వారికి రూ.5వేలు ఆర్థిక సాయం చేసేందుకు నేను ముందుకు వచ్చాను.'
- గోపాల్ రెడ్డి, పాశమైలారం
'ఆడపిల్లలు మగవారితో సమానం. అమ్మాయిలను ఎవరూ తక్కువ చేసి చూడకూడదని.. బాలికలకు రక్షణ కల్పించాలని మా ఊళ్లో ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి మా ఊళ్లో పండుగ చేసుకుంటాం. బ్యాండ్ బాజాతో ఆ చిన్నారికి స్వాగతం పలుకుతాం. వారి కుటుంబానికి చేదోడుగా ఆర్థిక సాయం చేస్తాం. మహాలక్ష్మి ఇంటికొచ్చిన వేళ.. ఆ ఒక్క ఇంటికే కాదు.. ఊరంతా పండుగ చేసుకుంటాం.'
- వినోద్, శివన్నగూడెం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!