కరోనా మొదటి వేవ్ నుంచి ఇటు ప్రజలు, ప్రభుత్వం సరైన గుణపాఠం నేర్చుకోలేదు అన్న దానికి నిదర్శనం ప్రస్తుత పరిస్థితులు. ప్రతి రోజు వేలాది మంది కరోనా భారీన పడుతున్నారు. ఈ మహమ్మారితో పోరాటంలో వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.
ఆసుపత్రుల ముందే..
శరీరంలోకి చేరిన కరోనా మహమ్మారి ఊపిరి ఆడనివ్వకుండా మృత్యుముఖంలోకి తీసుకెళ్తున్న సమయంలో వెంటిలేటర్లే సంజీవనిలు. ఐసీయూ బెడ్, వెంటిలేటర్ల కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని.. ప్రతి రోజు వందలాది మంది ఆసుపత్రులకు వెళ్తున్నారు. సరైన సమయంలో వెంటిలేటర్ సదుపాయం దొరకక.. ఆసుపత్రుల ముందే ప్రాణాలు వదులుతున్న వారు అనేక మంది ఉన్నారు.
స్టోర్ రూంకే పరిమితం
కరోనా మొదటి విడత సమయంలో ప్రభుత్వం వందలాది వెంటిలేటర్లు కొనుగోలు చేసి క్షేత్రస్థాయి ఆసుపత్రులకు పంపించింది. జిల్లా ఆసుపత్రులతో పాటు ప్రాంతీయ ఆసుపత్రులకు వీటని చేర్చింది. ఇందులో భాగంగా గత సంవత్సరం జూన్లో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి 20 వెంటిలేటర్లు వచ్చాయి. అప్పటికే అందుబాటులో ఉన్న రెండు వెంటిలేటర్లతో కలిపి మొత్తం సామర్థ్యం 22కు చేరింది. వీటి ద్వారా అత్యంత క్లిష్టంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న 22మంది ప్రాణాలు నిలబెట్టెందుకు అవకాశం ఉంది. కానీ.. సిబ్బంది లేరన్న కారణంతో వీటిని స్టోర్ రూంకే పరిమితం చేశారు.
అంతంత మాత్రమే
పరిస్థితి విషమించిన రోగులను గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. గాంధీలో పరిస్థితిని అంచన వేసి కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వెంటిలేటర్లు అంతంత మాత్రంగా ఉండటంతో వీటికి వీపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వెంటిలేటర్ దొరికినా ఒక్కో రోజుకు 50వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయి. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పేద, మధ్యతరగతి వారు అప్పులు చేసి మరి ప్రైవేటు ఆసుపత్రులకు డబ్బులు ధారపోస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు