సంగారెడ్డి శివారులో వెలసిన శ్రీనివాస క్షేత్రం శ్రీవైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల కోసం నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం నాలుగు గంటలకు తిరుప్పావై పాశురాల పఠనం ఉంటుంది. అనంతరం గరుడ వాహనంపై స్వామివారు దక్షిణ ద్వారం వద్ద ఉత్తరాభిముఖంగా వేంచేస్తారు. అర్చకులు వేద ఇతిహాస స్తోత్ర, పురాణ, దివ్య ప్రభందాలు స్వామివారికి విన్నవిస్తారు. నాలుగున్నర గంటల నుంచి భక్తులకు దర్శనం మొదలవుతుంది. స్వామి వారు స్వయంభువుగా ఉద్భవించిన కోనేటికి ప్రదక్షణ చేసిన అనంతరం.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేలా.. క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
భద్రతాపరమైన ఏర్పాట్లు
లక్షలాదిగా తరలివచ్చే భక్తులందరికీ స్వామి వారి దర్శనం అందించేలా.. అర్జిత సేవలను రద్దు చేశారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బందులు పడకుండా.. త్రాగు నీరు, మజ్జిగ, అల్పహారం అందించేలా.. ఏర్పాట్లు చేశారు. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచనున్నారు.
11న స్వామివారి రథయాత్ర
ఈ ఉత్సవాల్లో భాగంగా 7న వైకుంఠ ద్వాదశి, 11న స్వామివారి రథయాత్ర, 13న గోదరంగనాథుల కల్యాణోత్సవం, 15న సర్వమంగళా దేవి ఆవిర్భావోత్సవం నిర్వహించనున్నారు.