Uncultivated Leafy Vegetable Festival : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఆకు కూరల కంటే.. సాగు చేయని ఆకు కూరల్లో పోషక విలువలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. జీవన విధానంలో వచ్చిన మార్పులతో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రస్తుత వీటిని కలుపు మొక్కలుగా భావిస్తున్నారు. పాత పంటల జాతరతో ప్రతి ఏటా జహీరాబాద్‌లోని డీడీఎస్ (Deccan Development Society).. చిరుధాన్యాల సాగు, వినియోగంపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా జహీరాబాద్ మండలం అర్జున్నాయక్ తండా, ఝరాసంగం మండలం పొట్పల్లి గ్రామాల్లో సేంద్రీయ పంట పొలాల్లో క్షేత్ర సందర్శన కార్యక్రమం నిర్వహించింది
పాత పంటల జాతర షురూ.. నెల రోజుల పాటు రోజుకో ఊరిలో విత్తనాల ప్రదర్శన. ఆకు కూరలపై అవగాహన కల్పిస్తోంది.
"అన్నిరకాల ఆకు కూరలు తింటాం. పాతకాలపు ఆకు కూరలను మళ్లీ ఇక్కడ చూశాం. వారు వాడుతున్న ఆహార పదార్థాలను చెప్పడమే కాకుండా వంటచేసి మరీ చూపించారు." - సందర్శకులు
Uncultivated Leafy Vegetable Festival in DDS : ఈ ఆకు కూరలకు విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరమే లేదు. పొలాల్లో వాటంతట అవే మొలకెత్తుత్తాయి. ఇలాంటివి దాదాపుగా 160 రకాలకు పైగా ఉన్నాయి. జీవవైవిద్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న డీడీఎస్.. పొలాల నుంచి వివిధ రకరకాల ఆకు కూరలను సేకరించి.. జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షలు చేయించింది. పరిశోధనల అనంతరం సాధారణ ఆకు కూరల కంటే వీటిల్లో.. అధిక పోషకాలు ఉన్నట్లు నిపుణులు తేల్చారు.
ఆయా ఆకు కూరల వారీగా ఛాయచిత్రాలు ప్రదర్శన ఏర్పాటు చేసి.. వండే విధానం, తినడం వల్ల ప్రయోజనాలపై అనుభవజ్ఞులు, నిపుణులతో డీడీఎస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్, రబీలలో 160 రకాలకి పైగా పొలాల్లో సహజంగా పెరుగుతాయి. కాలానుగుణంగా దొరికే వీటిని వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతున్నాయని.. అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా పని చేస్తున్నాయని సాగుచేసే తండావాసులు చెబుతున్నారు.
పండ్లు, కాయగూరలు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి!
అధిక పోషకాలు, అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపే.. సాగు చేయని ఆకు కూరలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యతని డీడీఎస్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణిరావు తెలిపారు. సాగుచేయని ఆకుకూరల్లో సన్నపాయలు, అడవి కూర, అత్తిలి, పిట్టకూర, బంకటికూర, తెన్నంగిలాంటి పలు రకాలు ఉన్నాయని చెప్పారు. కలుపు మొక్కలుగా చూసే ఇవి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని రుక్మిణారావు పేర్కొన్నారు. కలుపు మొక్కలుగా చూసే సాగు చేయని ఆకు కూరలు మనకి ఎంతో మేలు చేస్తాయని కొండా లక్ష్మణ్ బాపూజీ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.అనిత కుమారి వివరించారు. డీడీఎస్తో కలిసి పనిచేసి వీటికి మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు.
"సాగు చేయని పంటల గురించి చిన్నపాటి కార్యక్రమాన్ని నిర్వహించాం. పాతకాలం నుంచి వారు వాడుతున్న ఆకు కూరల గురించి ఇక్కడికి వచ్చినవారికి తెలియజేశాం." - రుక్మిణి రావు, డీడీఎస్ డైరెక్టర్
"పాతకాలపు ఆకు కూరల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఇందులో భాగంగా వాటి అందులోని పోషకాల గురించి చెప్పారు. ఈ గ్రామంలోని మహిళలు వాటిని సంరక్షిస్తూ ముందు తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు." డా.అనిత కుమారి ప్రిన్సిపల్ సైంటిస్ట్, కొండా లక్ష్మణ్ బాపూజీ పరిశోధనా స్థానం