సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రాంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జహీరాబాద్‌లోని డ్రైవర్స్ కాలనీకి చెందిన అంబాజీకి తుల్జారాం(13), కృష్ణాజీ(10) కుమారులు. అంబాజీ పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇద్దరు చిన్నారులు తండ్రి ద్విచక్ర వాహనం టీవీఎస్ లూనాపై మార్కెట్‌కి వెళ్లారు.
ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న గౌతమ్ పాఠశాల బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అబ్బాయిలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కాగా... చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే తుల్జారామ్ మృతి చెందగా... చికిత్స పొందుతూ కృష్ణాజీ కన్నుమూశాడు. ఒకే ప్రమాదంలో కన్నబిడ్డలు ఇద్దరు మృతిచెందగా... కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.