kodandaram in plenary: రాష్ట్రంలో మారాల్సింది పాలకులు మాత్రమే కాదని.. పాలన కూడా మారాల్సిన అవసరముందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజలందరి కృషితో ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక్క కుటుంబం మాత్రమే లబ్ధి పొందుతోందన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రెండో ప్లీనరీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి పూల మాలలు చేశారు. అనంతరం పార్టీ జండా ఆవిష్కరించారు. మహిళలు వివిధ జిల్లాల నుంచి బోనాలు, బతుకమ్మలతో కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రత్యామ్నాయం అనడం హస్యాస్పదం
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు.. కానీ కేసీఆర్ ఇక్కడ గెలవలేకనే పీకేను తెచ్చి పెట్టుకుని కేంద్రంలో ప్రత్యామ్నాయం చూపుతామనడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని అధినేత కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారే ఇపుడు ప్లీనరీలో ఉన్నారని తెలిపారు.
ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడంలో తెలంగాణ జన సమితి ముందు ఉంటుందని కోదండరాం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైసలతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భూములను తక్కువ ధరలకు తీసుకుని వేరే వ్యక్తులకు కోట్లలో అమ్మి లాభాలు పొందుతున్నారని మండిపడ్డారు.
రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు
తాము చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డగించి అక్రమ కేసులు పెట్టడం న్యాయమా అని కోదండరాం ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పరిశ్రమల ముసుగులో ప్రభుత్వం అక్రమ దందాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో భూములకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాలను పుస్తకాల రూపంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
'తెలంగాణ అందరి కృషితో ఏర్పడింది. ఇవాళ ఒక్క కుటుంబమే అనుభవిస్తోంది. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి తెరాస శాపంగా మారింది. మారాల్సింది పాలకులు మాత్రమే కాదు పాలన కూడా మారాలి. సామాజిక న్యాయం జరగాలి. ప్రభుత్వ సొమ్ము ప్రతి ఒక్కరికీ వాటా దక్కాలి. అనేక సమస్యలపై మేం పోరాడుతున్నాం. భవిష్యత్తులో ఎజెండాను ప్రకటిస్తాం. తెలంగాణ ఆకాంక్షలకు తూట్లు పొడిచే ఈ పాలనను అంతమొందించేందుకు పోరాడుతాం. మా పోరాటానికి ప్రజల ఆశీస్సులు అవసరం. ఇక్కడ గెలవలేకనే పీకేను తెచ్చుకున్నారు. దిల్లీలో రాజకీయాలు చేస్తారా?'
-ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు