అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసింది. ఈ స్ఫూర్తితో సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పలు వినూత్న కార్యక్రమాలు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా భూవాణి, గ్రామ ఆరోగ్య వేదిక వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. తాజాగా గిరిజనుల సమస్యలు తెలుసుకోని.. వాటిని పరిష్కరించేందుకు తండా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
73 తండాలు... 6నెలలు
ఈ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక రోజు... ఒక తండాను జిల్లా యంత్రాంగం మొత్తం సందర్శించనుంది. తండా వాసుల సమస్యలను తెలుసుకొని.. ఆయా శాఖల వారీగా పరిష్కరించనున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, కనీస మౌలిక వసతుల కల్పన, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు.. ఉపాధి కల్పన వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 73 తండాలుండగా.. ఆరు నెలల్లో అన్ని తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. కంది మండలం ఎర్థనూర్ తండాలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.
కలెక్టర్ భరోసా:
కలెక్టర్ తండా మొత్తం కలియ తిరిగి.. గిరిజనల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ట్యాంకు ఎక్కి తండా భౌగోళిక, నైసర్గిక స్వరూపం పరిశీలించారు. డంప్ యార్డు, వైకుంఠధామానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ.. సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హమీనిచ్చారు. ఎలాంటి సమస్య ఉన్న తనని సంప్రదించాలని తండా వాసులకు కలెక్టర్ సూచించారు.
తండా వాసుల్లో ఆనందం
తమ తండాకు మొదటిసారి కలెక్టర్ వచ్చారని.. తమ సమస్యలు అడిగి తెలుసుకున్నారని తండా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండా బాట కార్యక్రమంతో అనేక మార్పులు వచ్చాయని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఇంటికి శౌచాలయం, ఇంకుడు గుంత నిర్మించారని వివరించారు. తమ తండా నుంచి ఇతర తండాలకు అనుసంధానంగా రోడ్డు, గ్రామ పంచాయతీ భవనం, పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం వంటివి కలెక్టర్ ప్రకటించడంపై తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర జిల్లాలకు ఆదర్శం:
తండాల్లో కనీస మౌలిక వసతుల కల్పనతో పాటు.. అర్హులందరీకి సంక్షేమ పథకాల అమలు, ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన తండా బాట విజయవంతమైతే.. సంగారెడ్డి ఇతర జిల్లాకు ఆదర్శంగా నిలువనుంది.
ఇదీ చూడండి : చంద్రయాన్-2: రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం