సంగారెడ్డికి చెందిన శాంతారావు విశ్రాంత ఉద్యోగి. తన 7 సంవత్సరాల వయస్సు నుంచే పోస్టల్ స్టాంపులు సేకరించారు. తన 20వ ఏట నుంచి కరెన్సీ సేకరణ ప్రారంభించారు. గత 47 సంవత్సరాలుగా తాను వివిధ కేటగిరీల్లో వేలాది బిళ్లలు, నోట్లు సేకరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు... రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు, ఆర్థిక కార్యదర్శులు సంతకాలున్న అన్ని నోట్లు ఉన్నాయి. 100, 200, 500, 1000 రూపాయల నాణేలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం విడుదల చేసిన అన్నీ రకాల నాణేలు, నోట్లు ఉన్నాయి.
![shantharao different types of stamps collection in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8916769_1.jpg)
10 కోట్ల నోటు..
మన కరెన్సీ మాత్రమే కాకుండా... 196దేశాలకు చెందిన కరెన్సీ శాంతారావు వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే అతి చిన్న, అతి పెద్ద నాణేలని కూడా సేకరించారు. 300 సంవత్సరాల క్రితం ఉపయోగించిన చెక్క నాణేలు... వివిధ దేశాలు ప్రత్యేక సందర్భలలో విడుదల చేసిన గాజు, ప్లాస్టిక్, వెండి, బంగారం లోహాలతో తయారు చేసిన బిళ్లలు... వివిధ భిన్న ఆకృతుల్లో రూపొందించిన నాణాలు సేకరించారు. యుగోస్లేవియా కరెన్సీలో పది కోట్ల విలువైన నోటు సైతం వీరి వద్ద ఉండటం విశేషం.
![shantharao different types of stamps collection in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8916769_4.jpg)
ఫస్ట్ డే కవర్లు..
వీరి వద్ద పది వేల రూపాయల నాణేలు, నోట్లు కూడా ఉన్నాయి. వీటిని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వివిధ ఏజెన్సీల ద్వారా, మిత్రుల ద్వారా... ఆయా దేశాల ఎంబసీల ద్వారా సేకరించారు. శాంతారావు దగ్గర 50వేలపై చిలుకు పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. మన దేశానికి చెందిన వాటితోపాటు... వివిధ దేశాలకు చెందినవి కూడా సేకరించారు. వీటిలో అయా ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసే స్టాంపులు... వాటికి అనుబంధంగా విడుదల చేసే ఫస్ట్ డే కవర్లు సైతం ఉండటం విశేషం. విభిన్న ఆకృతుల్లోని... ఒకే అంశానికి సంబంధించిన... వివిధ దేశాలు విడుదల చేసిన స్టాంపులు సేకరిస్తున్నారు.
![shantharao different types of stamps collection in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8916769_cover.jpg)
ఔరా అనిపించేలా..
కరెన్సీ, పోస్టల్ స్టాంప్స్ సేకరణే కాకుండా... మరో అభిరుచి సైతం శాంతారావుకు ఉంది. ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో లభించే... గవ్వలు, శంఖాలు సైతం సేకరిస్తారు. మిల్లీ గ్రాము గవ్వ నుంచి 5కేజీల బరువు ఉన్న భారీ శంఖం వరకు శాంతారావు వద్ద ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇంటికి వచ్చిన అతిథులు ఇది ఇళ్లా...? ఎగ్జిబిషనా..? అని ఆశ్చర్యపోతుంటారు.
![shantharao different types of stamps collection in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8916769_2.jpg)
కుటుంబ ప్రోత్సాహం..
శాంతారావు తన అభిరుచికి కుటుంబ సభ్యుల సహకారం, తోడ్పాటు మెండుగా ఉంది. వీరు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పడు అక్కడ లభించే వివిధ రకాల నాణేలు, గవ్వలు, శంఖులు తీసుకోస్తారు. సేకరించిన వాటిని శుభ్రం చేయడం, అయా కేటగిరీల వారీగా భద్రపర్చడంలో కొడుకు జోసెఫ్ పాత్ర కీలకమైంది. ప్రభుత్వం సహకరిస్తే... తన వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, పోస్టల్ స్టాంపులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానంటున్నారు శాంతారావు.
![shantharao different types of stamps collection in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8916769_3.jpg)
ఇదీ చూడండి: ఓఎన్జీసీలో భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు గల్లంతు