జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు సర్పంచులు, కాంట్రాక్టర్లకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెదకంజర్ల, చిన్నకంజర్ల, లక్డారం గ్రామాల్లో జిల్లా పాలనాధికారి హనుమంతరావు స్థానిక అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. చిన్నకంజర్ల గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణ పనుల్లో జాప్యం చేసిన టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆయా గ్రామాల్లో వైకుంఠథామం, డంప్ యార్డ్, రైతు వేదికల నిర్మాణపనుల పురోగతిని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. సర్పంచులు బాధ్యతతో యుద్ధ ప్రాతిపదికన ఆయా పనులను పూర్తిచేయాలని పాలనాధికారి సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
మండల స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. మొక్కలు నాటడం అందరి బాధ్యతనీ ఆయన పేర్కొన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మొక్కలను నాటడమే కాకుండా నాటిన వాటిని సంరక్షించడంలో శ్రద్ధ చూపించాలన్నారు. స్వచ్ఛ హరిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో తమ వంతు బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!