PET Was Beaten for Misbehaving with Students : అతనో వ్యాయామ ఉపాధ్యాయుడు. తన వద్దకు వచ్చే పిల్లలకు మంచి నడవడిక నేర్పి ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన గురువు. విద్యార్థులకు మంచి, చెడులు చెబుతూ.. తన బిడ్డల్లా చూసుకోవాల్సిన పీఈటీ. అలాంటి వాడి మదిలో పాడు ఆలోచన మొదలైంది. ఆడుకునేందుకని తన వద్దకు వచ్చే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆటల పేరుతో అమ్మాయిలను తాకరాని ప్రదేశాల్లో తాకేవాడు. 'మన సార్ ప్రవర్తనలో ఏదో తేడాగా ఉందే..' అని విద్యార్థినులకు మొదట కాస్త అనుమానం వచ్చినా.. ఏ.. మన సార్ అలాంటోడు కాదులే.. అని వారికి వారే సర్ది చెప్పుకున్నారు.
రోజురోజుకూ ఇలాంటి 'అనుమాన బాధితులు' ఎక్కువవుతున్నా.. కామ్‌గానే ఉండిపోయారు. ఇదే అదనుగా ఆ పీఈటీ మరింత రెచ్చిపోయాడు. ఈసారి ఏకంగా ముద్దు పెట్టాలని.. లేకపోతే భవనంపై నుంచి తోసేస్తానని బెదిరింపులకు దిగాడు. ఇక అతడి ఆగడాలను భరించలేని విద్యార్థినులు విషయాన్ని ఇళ్లల్లో చెప్పేశారు. విషయం ఊర్లో తెలియడంతో గ్రామస్థులంతా కలిసి ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Attack on Sirgapur High School PET : వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో శుక్రవారం ఓ వ్యాయామ ఉపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలో పీఈటీగా చేస్తున్న సంగ్రాం అనే అధ్యాపకుడు.. మార్చి నెలలో ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా వేధించాడు. పాఠశాల భవనంపైకి తీసుకెళ్లి.. ముద్దు పెట్టాలని, లేకపోతే కిందకు తోసేస్తానంటూ భయపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా.. ఆ ముగ్గురు బాలికలు మాత్రం బడికి వెళ్లడం లేదు. కారణం ఏంటా అని కుటుంబసభ్యులు ఆరా తీయగా.. పీఈటీ సంగ్రాం ఉంటే తమకు భయంగా ఉందని బాలికలు తల్లిదండ్రులకు తెలిపారు.
పీఈటీ, హెచ్‌ఎంలకు దేహశుద్ధి..: పిల్లలు చెప్పిన మాటలతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు.. గ్రామస్థులతో కలిసి శుక్రవారం పాఠశాలకు వెళ్లారు. పీఈటీ సంగ్రాంను పిలిచి నిలదీశారు. అతడు తటపటాయించడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయనపైనా దాడి చేశారు. అనంతరం సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అదే సమయంలో బయటి నుంచి వచ్చిన ఓ హోంగార్డు.. గ్రామస్థులను దూషించడంతో అతడిపైనా చేయి చేసుకున్నారు.
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..: విషయం తెలుసుకున్న డీఈవో వెంకటేశ్వర్లు, కంగ్టి సీఐ రాజశేఖర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. హెచ్‌ఎం, పీఈటీ సంగ్రాంలను సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డుపై చర్యలు తీసుకుంటామని.. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని సీఐ రాజశేఖర్ తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు, పీఈటీలను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఇవీ చూడండి..
హెడ్మాస్టర్ పాడుబుద్ధి.. దేహశుద్ధి చేసిన బాలిక తల్లిదండ్రులు
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. డ్రైవర్‌కి దేహశుద్ధి..
మైనర్ బాలికపై అత్యాచారం.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు