గ్రేటర్ ఎన్నికల ఓట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం సీసీ ఫుటేజ్ డిసెంబర్ 1 నుంచి లెక్కింపు తేదీ వరకు అందజేయాలని పటాన్చెరు డివిజన్లో పోటీ చేసిన భాజపా అభ్యర్థి ఆశిష్ గౌడ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపుపై అనుమానాలున్నాయని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో అన్నారు. స్ట్రాంగ్ రూం సీసీ పుటేజీ ఇవ్వాలంటూ ఆర్వోకు లేఖ రాసినట్లు చెప్పారు.
దుబ్బాక ఓటమిని జీర్ణించుకోలేక పటాన్చెరు సర్కిల్లో అధికారులను చేతుల్లో పెట్టుకొని మంత్రి హరీశ్ రావు... భాజపా నాయకులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. బ్యాలెట్ బాక్స్‌లపై భాజపా ఏజెంట్ల సంతకం తీసుకోలేదని విమర్శించారు. తాను స్ట్రాంగ్ రూంకి వెళ్తే ఎన్నికల పరిశీలకులు వచ్చి వీడియో తీశారు తప్ప తన చేత సంతకం తీసుకోలేదని తెలిపారు. ఎన్నికల్లో ఏ అధికారి తమకు సపోర్ట్ చేయలేదని ఆయన అన్నారు. పటాన్చెరులో చేసే అక్రమాల్లో ఎవరి వాటా ఎంత ఉందో సీబీఐ విచారణ ద్వారా వెల్లడిస్తామని హెచ్చరించారు. తాను ఓడినా... ప్రజల మనసు గెలుచుకున్నానని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల ముందుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేరచరితుల్ని నిలువరిస్తేనే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు!