మహిళలు, యువతుల పైన రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. వీటని ఆరికట్టాలంటే.. పౌరసమాజం పాత్ర కీలకంగా ఉండాలని గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామం నిర్ణయానికి వచ్చింది. స్త్రీలను గౌరవించని వారికి తమ ఊర్లో స్థానం లేదని తీర్మానం చేశారు. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారికి శిక్ష పడే వరకు వదలి పెట్టబోమంటున్నారు గ్రామస్థులు. దీని పై గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం చేశారు.
తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
మహిళల భద్రత విషయంలో కఠినంగా ఉంటామని..తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదంటున్నారు కానుకుంట గ్రామస్థులు. పిల్లలు చేసే తప్పుల్లో వారి తల్లిదండ్రుల బాధ్యత కూడాఉంటుందన్నారు. కనుక పిల్లలు తప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. తప్పు చేసిన వారి తల్లిదండ్రులను సైతం శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.
మిగతా గ్రామాలు మా బాటలో నడిచేలా చేస్తాం
తమ బాటలోనే ప్రతి ఊరు నడిచే విధంగా మహిళా, యువజన సంఘాలను భాగస్వాములను చేస్తున్నారు. ఈ సంఘాలను పురమాయించి ఇతర గ్రామల్లో అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ కూడా ఇలాంటి తీర్మానాలు చేసేలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే కానుకుంట పరిసర గ్రామాలైన మంబాపూర్, బొంతపల్లి ఇదే బాటలో నడుస్తున్నాయి.
కానుకుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామం ఇదే బాటలో తీర్మానాలు చేస్తే .. మహిళలు, యువతులపై జరిగే అత్యాచారాలను అరికట్టే అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి:భారీ వర్షాలతో గోదావరికి జల కళ