సంగారెడ్డి జిల్లా బీరంగూడ కూడలి నుంచి కిష్టారెడ్డిపేట్ వరకు 50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంద అడుగుల వెడల్పు రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. అమీన్పూర్ మండలం బీరంగూడ చౌరస్తా నుంచి కిష్టారెడ్డిపేట బాహ్య వలయ రహదారి వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. నర్రె గూడెం చౌరస్తా వరకు విస్తరణ పనులు పూర్తి కావచ్చాయని వెల్లడించారు. 5 కిలోమీటర్ల పరిధిలో రెండున్నర కిలోమీటర్ల విస్తరణ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు.
ప్రజలకు దూర భారం తగ్గుతుంది:
రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేకంగా వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మిస్తున్నట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే అమీన్పూర్ మున్సిపాలిటీతోపాటు అమీన్పూర్, జిన్నారం మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాల ప్రజలకు దూర భారం తగ్గుతుందని తెలిపారు. అంతేకాకుండా బాహ్య వలయాలు రహదారి చేరుకునేందుకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రహదారి విస్తరణ సమయంలో సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిశీలనలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, హెచ్ఎండీఏ ఈఈ అప్పారావు, డిప్యూటీ ఈఈ దీపక్ లు ఉన్నారు.
ఇదీ చూడండి: దొంగ నంబరు ప్లేట్లతో దర్జా.. వాహన యజమానులకు ఇబ్బందులు