మెతుకుసీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో మొట్టమెదటి పీజీ కళాశాలను నాలుగు దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు. మిర్జాపూర్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. షుగర్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమెస్ట్రీ కోర్సులతో బాలుర కళాశాలగా ప్రారంభమైంది. ప్రారంభంలో ఉన్న రెండు కోర్సులతోనే 40 సంవత్సరాలకు పైగా కాలం గడిచిపోయింది. కొన్నేళ్ల కిందట కోర్సుల ఆధునికీకరణలో భాగంగా షుగర్ కెమిస్ట్రీ స్థానంలో ఇన్ ఆర్గానిక్స్ కెమిస్ట్రీని ప్రవేశపెట్టారు.
నాటి నుంచి ఇప్పటి వరకు కొత్త కోర్సులు ఏర్పాటు చేయకపోవడంతో.. నానాటికీ పీజీ కాలేజీ ఆదరణ కోల్పోతోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా.. ప్రారంభ సమయంలో నిర్మించిన కళాశాల, వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరాయి. సువిశాల ప్రాంగణం ఉన్నప్పటికీ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు మొలవడంతో గ్రామస్థులు పశువులను మేపుతున్నారు. ప్రహరీ కూలిపోవడంతో.. రూ.కోట్లు విలువ చేసే భూమి అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సీపీ గేట్ ద్వారా ఈ కళాశాలలో ప్రవేశాలు చేపడతారు. ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న రెండు కోర్సులకు అనుసంధానంగా ఈ సంవత్సరం ఒక కోర్సును తీసుకువచ్చారు. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో పాటు.. కో-ఎడ్యుకేషన్‌గా మార్చితే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కళాశాలపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరిస్తే... పూర్వ వైభవం సంతరించుకుంటుంది. వందలాది మంది విద్యార్థులతో కళకళలాడుతుంది.
ఇవీ చూడండి..