లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉండటం, ఉపాధి లేకపోవడం, స్వస్థలాలకు పంపాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు వెలువరించడం వల్ల ఇళ్లకు వెళ్లిపోవాలనే తాపత్రయం సంగారెడ్డి జిల్లా వలస కార్మికుల్లో కనిపిస్తోంది. తమ గ్రామం వారికి ఫోన్లు చేస్తూ... అక్కడి అధికారులకూ ఇదే విషయాన్ని చెప్పాలని కుటుంబ సభ్యులు, బంధువులను కోరుతున్నారు. ఇక్కడ సమీపంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకూ వెళ్లి తాము వెళ్లిపోతామని, అందుకు ఏర్పాట్లు చేయించాలని అడుగుతున్నారు. వినతులు తీసుకొని పేర్లు నమోదు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. తమకు పైనుంచి ఈ విషయమై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని.. కొద్దిరోజులు ఓపిక పట్టాలని క్షేత్రస్థాయి అధికారులు వివరిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న తర్వాత పంపే ప్రక్రియ ఆలస్యమయితే గొడవలకూ దారితీస్తుందనే కోణంలో ఆలోచించి... వారికి నచ్చజెప్పి తిప్పి పంపుతున్నారు.
10వేల మందికి పైగానే...
పటాన్‌చెరు, అమీన్‌పూర్, బొల్లారం, ఇస్నాపూర్ తదితర ప్రాంతాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. మార్చి 23 నుంచే చాలా మంది కాలినడకన సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 10వేల మందికి పైగా ఇలా వెళ్లిపోయి ఉంటారనేది అంచనా. అమీన్‌పూర్, ఇస్నాపూర్ పరిధిలో నివసించే నారాయణఖేడ్ వాసులు వారి గ్రామాలకు వెళ్లారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో చాలా అద్దె ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి.
శనివారం కొన్ని చోట్ల ఇలా...
- కంది మండలం చేర్యాల పరిధిలో ఉన్న టైర్ల పరిశ్రమలో 300 మంది కార్మికులు తమను ఇళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో మిగిలిపోయిన 1,200 మంది ఇదే విషయాన్ని అధికారులకు వివరించారు. ఝార్ఖండ్‌వాసులను పంపినట్లుగానే తమనూ స్వరాష్ట్రాలకు పంపించాలని కోరారు. తొందరపడొద్దని, అందరినీ త్వరలోనే పంపుతామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి వారికి స్పష్టం చేశారు.
- తమ ఊళ్లకు వెళ్లిపోతామని జిన్నారం మండలం గడ్డపోతారం పంచాయతీ కార్యాలయానికి వివిధ రాష్ట్రాల కార్మికులు వచ్చారు. ఏపీకి చెందిన 20 మంది సొంత రాష్ట్రానికి పంపాలని అందోలు తహసీల్దారును కోరారు.
- పటాన్‌చెరు మండలంలోని కార్మికులు దాదాపు 150 మంది తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. తాము చాలా మంది ఉన్నామని, గ్రామాలకు వెళ్లిపోతామని విజ్ఞప్తి చేశారు. పటాన్‌చెరు పరిధిలోని రెండు హోటళ్లలో వంద మంది వరకు పనిచేస్తుంటారు. తమను ఇంటికి పంపించాలని వారు తెలిసిన వారి సాయంతో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
- మునిపల్లి మండలంలో 363 మంది కార్మికులు స్థానిక నాయకుల వద్దకు వచ్చి తహసీల్దారుకు ఫోన్ చేయించారు. తమను పంపించాలని మొరపెట్టుకున్నారు.