టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంఛార్జీ గాలి అనిల్ కుమార్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల కేంద్రంలోని అశోక్ నగర్లో ఉన్న ఆయన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అలాగే కొనుగోలు కేంద్రాల్లో తాలు కింద నాలుగు కేజీలు తీసేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు సరైన మద్దతు ధర ఇచ్చి, కొనుగోళ్ల డబ్బులను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో ప్రపంచం అల్లాడి పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూలీ, నాలీ చేసుకునేవారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ