నిన్నటి నుంచి కురిసిన కుండపోత వానతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. జహీరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో హైదరాబాద్- ముంబయి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నీట మునిగిన ఇళ్లు
పట్టణ శివారులోని వసంత్ విహార్, ఇంద్రప్రస్థ కాలనీ, డ్రీమ్ ఇండియా కాలనీ, మూసా నగర్, నేతాజీ నగర్ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అల్గోల్-జహీరాబాద్, బీదర్- జహీరాబాద్ రోడ్లపైకి వరద నీరు చేరడంతో పోలీసుల పర్యవేక్షణలో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి.
వరదలకి కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టు నిండడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షంతో డివిజన్లో అల్లం, చెరుకు, అరటి, ఆలూ, సోయా, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరి గర్భగుడి మునిగిపోయింది.
ఇదీ చదవండి: భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం