వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికి తెలియదన్నది ఓ నానుడి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో కొంతమేర వానని అంచనా వేసినా.. అది అంతంత మాత్రమే. కచ్చితమైన వర్షపాతాన్ని అంచనా వేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రోఫెసర్ కీర్తి సాహూ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు సృష్టికే ప్రతిసృష్టిలాంటిది తయారు చేశారు. భూమి నుంచి 6కిలోమీటర్ల ఎత్తు వరకు ఆకాశంలో ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించే సిమ్యూలేటర్‌ను రూపొందించారు.
వర్షపాతం వర్షపు బిందువు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా వాన చుక్క పరిమాణం ఉంటుంది. ప్రస్తుతం రాడార్ల ద్వారా ఆకాశంలోకి సంకేతాలు పంపి.. వచ్చిన ఫలితాల ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేస్తున్నారు. డ్రోన్లు, విమానాలు వంటి వాటిని ఆకాశంలోకి పంపి పైన ఉన్న సమచారాన్ని సేకరిస్తున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి చేస్తున్న అంచనాలకు.. వాస్తవ పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉంటోంది.
10సంవత్సరాల పాటు శ్రమించిన పరిశోధకులు: భూమికి, మేఘాలకు మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతలు, తేమను పరిగణలోకి తీసుకోకపోవడం దీనికి కారణంగా ఐఐటీ పరిశోధకులు గుర్తించారు. 10సంవత్సరాల పాటు శ్రమించి ఈ సమస్యను అధిగమించే పరిష్కారాన్ని కనుగొన్నారు. భూమి నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు గల పరిస్థితులను కృత్రిమంగా కల్పించే సిమ్యూలేటర్‌ను ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. ఈ భారీ పరికరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
90శాతం వరకు తేమను సిమ్యూలేటర్‌లో సృష్టించుకునే అవకాశం: వాతావరణంలోని పరిస్థితుల వల్ల వాన బిందువు.. భూమిని చేరే లోపల పరిమాణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి అంచనాల కోసం లేజర్ కట్టింగ్ అనుసంధానించారు. సాధారణంగా పైకి కిలోమీటర్ ఎత్తుకు వెళ్లే కొద్ది 10డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. -10డిగ్రీల వరకు ఉష్ణోగ్రత, 90శాతం వరకు తేమను సిమ్యూలేటర్‌లో సృష్టించుకునే అవకాశం ఈ పరికరంలో ఉంది. దీనిని పూర్తిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులే రూపొందించారు. స్థానికంగానే తయారీ సైతం పూర్తి చేశారు.
ఇందులో మిషన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్‌లైన్ హలోగ్రఫీ సాంకేతికతను సైతం ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన అంచనాకు ఇది సహకరిస్తుంది. ప్రస్తుతం భారత వాతావారణ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకుని.. సిమ్యూలేటర్లో ఆ పరిస్థితులను కల్పించి.. అంచనాలు రూపొందిస్తున్నారు. భవిష్యత్‌లో సొంతంగా డ్రోన్ ద్వారా సమాచారాన్ని సేకరించుకునే దిశగా సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం భారత వాతావరణ శాఖ, ఇస్రో వంటి సంస్థలతో ఐఐటీ పరిశోధకులు ఒప్పందాలు చేసుకుని కలిసి పరిశోధనలు చేస్తున్నారు. పలు విదేశీ సంస్థలు సైతం దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు అనేక విషయాల్లో తన సత్తా చాటుతున్న ఐఐటీ హైదరాబాద్.. ఇక నుంచి వాతావారణ అంచనాల్లోనూ తన ముద్ర వేయనుంది.
"వివిధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు ఎక్కడ ఎన్ని సెంటిమీటర్ల వర్షపాతం పడుతుందో అంచనా వేయవచ్చు. ఈ సిమ్యూలేటర్ ద్వారా భూమి నుంచి 6కిలోమీటర్ల ఎత్తు వరకు గల పరిస్థితులను కృత్రిమంగా కల్పించవచ్చు." - డా. కీర్తి సాహూ, ఐఐటీహెచ్ ఆచార్యుడు
"ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఐఐటీ హైదరాబాద్‌లో తయారుచేశాం. మనకు వర్షపాతం ఎప్పుడు ఎంత వస్తుందో అంచనా వేయవచ్చు. ఈ సిమ్యూలేటర్ ద్వారా మనకు ఈరోజు వర్షపాతం ఎంత పడుతుంది. రేపు ఎంతశాతం పడుతుందో అంచనా వేయవచ్చు. తద్వారా వరదలు వచ్చే అవకాశాన్ని ముందే పసిగట్టవచ్చు." - డా. లక్ష్మణ్ దొర చంద్రాల, ఐఐటీహెచ్ ఆచార్యుడు
ఇవీ చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలి: కవిత
'నన్ను బెదిరించొద్దు.. కోర్టు నుంచి వెళ్లిపోండి!'.. సీనియర్ లాయర్‌పై చీఫ్ జస్టిస్ ఫైర్