Sangareddy farmers demands for irrigation water: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో వర్షాలు రాక సరైన భూగర్భ జలాలు లేక మండలంలో బీడు భూమిగా మారిన వందల ఎకరాల భూములను.. సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. మండల పరిధిలోని బొగ్గులంపల్లి, కర్చల్, నాగనపల్లి, రాయిపల్లి, ఇందూర్ గ్రామాల పరిధిలోని 2640 ఎకరాలకు సాగు నీరు అందించేలా.. బొగ్గులంపల్లి చెరువు పై ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు రచించారు.
దీనికోసం అదే సంవత్సరం రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధుల నుంచి 19 కోట్లు మంజూరు చేశారు. 2013 వానాకాలం పంటకే సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మంజీరా నదికి అనుసంధానంగా ఉన్న బొగ్గులపల్లి ప్రాజెక్ట్ జాక్వెల్ నుంచి నేరుగా గ్రావిటీ ప్రాంతంలో అంతర్గత బావిని ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతంలో మరో అంతర్గత బావిని నిర్మించారు. వాటిలో భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఎత్తిపోసిన నీటిని తరిలించేందుకు నాగనపల్లి వైపు ఒకటి, బొగ్గులంపల్లి వైపు మరొక సంపు నిర్మించారు.
మోటర్లకు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా లైన్లు వేయడంతో పాటు భారీ ట్రాన్స్ఫార్మర్లు సైతం ఏర్పాటు చేశారు. గడువు ప్రకారం 2012లోనే పనులు పూర్తి చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి సాగు నీరందించిన దాఖలాలు లేవని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం 2017 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే బాబూమోహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి.. ట్రయల్ రన్ పూర్తి చేశారు.
ప్రాజెక్టు పరివాహ ప్రాంతంలోని కొంత ప్రాంతానికి ఒక పంటకు సాగు నీళ్లు అందించారు. అంతే అప్పట్నుంచి ఇప్పటివరకూ ఒక్కచుక్కా సాగు నీరులేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనకట్టు కింద దాదాపు 1120మంది రైతులు ఉన్నారు. వారి వద్ద నుంచి మరమత్తులు.. ఇతర నిర్వాహణ ఖర్చుల కోసం గతంలో ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున అనధికారికంగా డబ్బులు సైతం వసూలు చేసారు.
ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉండటంతో వాటి పరికరాలు.. యంత్రాలు శిథిలం అవుతున్నాయని.. దీనికి తోడు ఇటీవల ట్రాన్స్ఫార్మర్లు సైతం చోరికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారినా.. తమకు మాత్రం ప్రయోజనం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎత్తిపోతల ప్రాజెక్టును ఉపయోగంలోకి తేవాలని విన్నవిస్తున్నారు.
ఇవీ చదవండి: