సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రెడ్‌జోన్ ప్రాంతంలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. జహీరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైన గడిమోహల్లా కాలనీ పరిసరాల్లో, రచన్నపేట్లో రెడ్‌జోన్ విధించినప్పటికీ ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్య సేవలు అందిస్తున్నారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం రెడ్‌జోన్ ప్రాంతంలో ఎలాంటి దుకాణాలు, ఇతర సముదాయాలు ఉండకూడదు. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాల నడుస్తుందన్న సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఆర్డీవో రమేష్ బాబు, డీఎస్పీ గణపతి జాదవ్ ఆస్పత్రి రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధలను అతిక్రమించి నిర్లక్ష్యంగా ఆస్పత్రిని తెరిచిన యాజమాన్యాన్ని, వైద్యబృందం, సిబ్బందిని మందలించారు. ఆస్పత్రిని సీజ్ చేశారు. జహీరాబాద్ పట్టణంలో మరోచోట ప్రైవేటు క్లినిక్ లో వైద్య సేవలు అందించడమే కాకుండా పేషెంట్లు భౌతిక దూరం పాటించకపోవడం పట్ల మండిపడిన అధికారులు క్లినిక్‌ను సీజ్ చేశారు.