Demolitions in GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు, ఇతర అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా ఇవాళ నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. గత నాలుగు రోజుల్లో 45 అక్రమ నిర్మాణాలను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు కూల్చివేశాయి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 5 అక్రమ నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 3 అక్రమ నిర్మాణాలను, తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 2 అక్రమ నిర్మాణాలను, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం పన్నెండు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
యజమాని, అధికారులకు మధ్య వాగ్వాదం
Demolition of illegal structures: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు డివిజన్‌లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని గ్రేటర్ టాస్క్‌ఫోర్స్ బృందం కూల్చివేతలకు దిగింది. ఇంటి యజమానికి అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి యజమాని కోడలు సొమ్మసిల్లి పడిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. పటాన్‌చెరు శిశుమందిర్ కాలనీలో బహుళ అంతస్తులతో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇంటి వెనుక భాగం తిమ్మక్క చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి రావడంతో గ్రేటర్ అధికారులు దానిపై దృష్టి సారించారు.
సొమ్మసిల్లి పడిపోయిన యజమాని కోడలు
టాస్క్‌ఫోర్స్ బృందం బహుళ అంతస్తుల భవనం కూల్చివేతలకు దిగింది. ఇంటి యజమాని అడ్డుకునే ప్రయత్నం చేయగా గొడవ జరిగింది. పోలీసు బందోబస్తు మధ్య భవనం కూల్చివేస్తుండగా భవన యజమాని కోడలు సొమ్మ సిల్లి పడిపోగా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గ్రేటర్ టాస్క్‌ఫోర్స్ బృందం యధావిధిగా కూల్చివేతలు కొనసాగించింది.
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలిక పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని దూలపల్లిలో అక్రమ భవనాలు, షెడ్ల నిర్మాణాలను హెచ్ఎండీఏ. పురపాలక అధికారులు కలిసి కూల్చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా నగర శివారు మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది.
ఇదీ చదవండి: