సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామం మాధవపురి హిల్స్‌లో అనుమతుల్లేకుండా ఆలయాన్ని నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ మానవ హక్కులు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ సంస్థ 2018లో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది.
జంట నగరాల్లో 2,400 పైగానే...
2010లో రెవెన్యూ శాఖ జీవో 262 జారీ చేసిందని, దీనిపై సమగ్ర సర్వే జరపాలని పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. 6,707 అక్రమ నిర్మాణాలుంటే జంట నగరాల్లోనే 2,400కు పైగా ప్రార్థనా మందిరాలు అక్రమంగా వెలిశాయని... ఇది 2010 నాటి పరిస్థితని పదేళ్ల తర్వాత ఆ సంఖ్య పెరిగిందా, తగ్గిందా అని హైకోర్టు ప్రశ్నించింది. 262 జీవో ప్రకారం జంట నగరాల్లో అక్రమ నిర్మాణాలెన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని ఆదేశించింది.
ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి..
ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో ఏకాభిప్రాయం రాకపోయినా... ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి అక్రమ కట్టడాలను సహించేది లేదనే సందేశం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. జంట నగరాల్లో ఎన్ని అక్రమ నిర్మాణాలున్నాయి.. ఎన్ని తొలగించారనే విషయంలో ఏడాదికి ఒక్కసారైనా సమీక్షించారా? అని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిని ప్రశ్నించింది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే... మతపరమైన నిర్మాణాలకు ఎలాంటి అడ్డులేదనే ఉద్దేశంతో.. అన్ని మతాలకు చెందిన వాళ్లు నిర్మాణాలు చేసుకుంటూపోతే ఎలా? అని హైకోర్టు నిలదీసింది.
కౌంటర్ దాఖలు ఎందుకు చేయలేదు?
అమీన్పూర్ ఆలయ విషయంలో కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడం తగదని... కమిటీ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని హైకోర్టు తెలిపింది. అడ్వకేట్ కమిషనర్‌గా ప్రవీణ్‌రెడ్డిని నియమిస్తూ... ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలను ఆయనే చూసుకుంటారని జారీ చేసింది.
అక్రమ నిర్మాణాలపై ఏటా సమీక్షించాలి..
ప్రార్థనా మందిరాల అక్రమ నిర్మాణాలకు సంబంధించి 2010లో జీవో వచ్చాక.. ఇప్పుడు ఇక్కడ చర్చిస్తున్నామని.... 2030లో మరోసారి చర్చిద్దామంటే కుదరదని.. ఏటా సమీక్షించాల్సిందేనని హైకోర్టు తెలిపింది. అమీన్పూర్ ఆలయానికి సంబంధించి మార్చి 13లోపు నివేదిక సమర్పించాలని అడ్వకేట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
ఇదీ చదవండిః విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!