సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కష్టపడి ఉద్యోగం సాధించినప్పటికీ.... అమ్మకు దగ్గరుండి సేవ చేయలేకపోతున్నానే బెంగతో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగదేవ్పూర్ మండలం తీగుల్‌కు చెందిన నవీన్... అక్టోబర్ 30న కంగ్టి మండలం పార్టు తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల అమ్మే... కొడుకును కష్టపడి చదివించి ప్రయోజకున్ని చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగమూ వచ్చింది. ఆ ఉద్యోగం వల్ల అమ్మకు దూరమయ్యానని నవీన్ తీవ్రంగా కుంగిపోయాడు.
ఉదయం పాఠశాల విధులకు వెళ్లి వచ్చాడు. మనోవేదనకు గురైన నవీన్... మధ్యాహ్నం సమయంలో కంగ్టిలోని అద్దె గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం విధుల నుంచి వచ్చిన తోటి ఉపాధ్యాయులు తలుపులు కొట్టిన తీయకపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... తాళం పగలగొట్టి తలుపులు తీశారు. అప్పటికే నవీన్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. నవీన్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా