సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెరాస నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. గల్లీ ఎన్నికలకు దిల్లీ మంత్రులు దిగుతున్నారని అన్నారు. అసలు చార్జ్‌షీట్ వేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన భాజపాపై వేయాలన్నారు. ప్రధాని మోదీ తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాత్రికి రాత్రే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి అన్యాయం చేశారని చెప్పారు.
ఏటా రూ.500 కోట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును అప్పనంగా ఆంధ్రాకు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేస్తే దాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. ఐజీఎస్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదన్నారు. అలాగే బీఆర్జీఎఫ్ రూ.450 కోట్ల నిధులు ఇవ్వాలని మూడుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినా ఇవ్వలేదన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.1000 కోట్లు కూడా ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపిందని చెప్పారు.
వరద సహాయ నిధి బెంగళూరు, గుజరాత్‌కు అందించారని.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మేయర్ పీఠమే లక్ష్యంగా తెరాస ప్రచార హోరు