కేంద్రం తాత్సరం, ఆంధ్రా మొండి వైఖరి వల్లే కృష్ణా నీటిలో... తెలంగాణ న్యాయమైన వాట దక్కించుకోలేక పోతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆచార్య జయశంకర్ (Professor Jayashankar) స్ఫూర్తితో గోదావరిలో వాటా సాధించామని... కృష్ణా నీటిలోనూ వాటా కోసం సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారని... స్వరాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా, కలగా చివరి శ్వాస వరకు పోరాటం చేశారని హరీశ్ రావు కీర్తించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమం ప్రారంభించిన జయశంకర్ పేరును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి... ఓ జిల్లాకు పెట్టుకుని గౌరవించుకున్నామని పేర్కొన్నారు.
జయశంకర్ ఆశయాలను, కలలుగన్న తెలంగాణను నిర్మాణం చేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని హరీశ్ రావు తెలిపారు. ఆ దిశగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని... అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
జయశంకర్ గారు అనేక విషయాల్లో ముఖ్యంగా నీళ్ల విషయంలో వాటా దక్కాలంటే కచ్చితంగా రాష్ట్రం ఏర్పడి తీరాలని మాట్లాడేవారు. దాంట్లో భాగంగా ఇవాళ గోదావరి జలాల్లో మన వాటాను మనం దక్కించుకోగలిగాం. కృష్ణా జలాల్లో ఇవాళ ఇప్పటికి పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తాత్సారం, ఆంధ్రా మొండి వైఖరి వల్ల ఇంకా నిర్ణయాలు తేలడం లేదు. న్యాయపరంగా సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నాం. కేంద్రంతో పోరాటం చేస్తున్నాం. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తప్పకుండా సాధించుకుంటాం. జయశంకర్ గారి ఆలోచనలను, కలలను నిజం చేసుకుంటాం. గోదావరిలో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. మన వాటాను సద్వినియోగం చేసుకునేలా అడుగు ముందుకు పడింది. అదే స్ఫూర్తితో కృష్ణానదిలో మన వాటాను సాధించుకునే దిశగా ముందుకు సాగుతాం.
-- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చూడండి: Hashish Oil: హైదరాబాద్‌లో 'హాషీష్ ఆయిల్'... పోలీసులకు సవాల్!