Fake Pesticides in Sangareddy District : వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి. అప్పుడే రైతు తాను నమ్ముకున్న భూమిని అనుకూలంగా పండించగలడు. కానీ.. కొందరు వ్యాపారుల ధన వ్యామోహం రైతుల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో నకిలీ పురుగు మందుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ పురుగు మందుల దుకాణం యజమాని ఏకంగా నకిలీ మందుల తయారీకి పూనుకున్నాడు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఇతని వద్ద కొన్న మందుల వల్ల ప్రయోజనం కలగకపోవడంతో.. రైతులు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామ పరిధిలో ఆనంద్ జైన్ అనే వ్యక్తి శ్రీ హలమ ట్రేడింగ్ పేరుతో ఎరువులు, పురుగు మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతని దగ్గర కొనుగోలు చేసిన మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆనంద్ జైన్ దుకాణంతో పాటు గోదాంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత కొంతకాలంగా భారీగా పురుగు మందులు తయారు చేసి అమ్ముతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.
నకిలీ పురుగు మందుల కలకలం..: ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్ రసాయనాన్ని సైతం పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అతనికి చెందిన మరో గోదాంను సైతం అధికారులు తనిఖీ చేశారు. ఇందులో వేల లీటర్ల నల్లటి రసాయనంతో పాటు కాలం చెల్లిన షాంపూలు, శీతల పానీయాలు, సాస్‌లు, బిస్కెట్లు వంటివి భారీగా బయటపడ్డాయి. వీటితో రసాయనాన్ని తయారు చేసి.. పత్తి చేను పురుగుల నివారణకు మందులుగా అమ్మినట్లు అధికారులు తెలిపారు. ఈ మందులు వాడిన వారికి ప్రయోజనం కలగకపోవడంతో కొందరు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?: ఇక్కడ స్వాధీనం చేసుకున్న విత్తనాలు, పురుగు మందుల నమూనాలను ప్రయోగశాలలకు పంపించారు. బహిరంగంగానే ఈ స్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా కార్యకలాపాలు సాగుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మామూళ్ల మత్తులో ఇలాంటివి చూసీచూడనట్లు వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు అడిగిన మామూళ్లు ఇవ్వనందుకే తమను తనిఖీలతో వేధిస్తున్నారని దుకాణం యజమాని ఆరోపించారు. రైతు సంఘం నాయకులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని.. పీడీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల నివారణ కోసం ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యను పూర్తిగా నివారించలేకపోతోంది.
ఇవీ చదవండి: