ప్ర: పటాన్చెరు మార్కెట్ ని ఎలా అభివృద్ధి చేయనున్నారు?
జ: ప్రస్తుతం మలక్‌పేట్ నుంచి వచ్చిన హోల్‌సేల్ ఉల్లి వ్యాపారులకు వర్షాకాలంలో సరుకు తడిసిపోకుండా షెడ్లు నిర్మించాం. అలాగే వచ్చేపోయే వాహనాలకు సీసీ రహదారులు కూడా వేస్తున్నాం. నిర్వహణకు అనువుగా సౌకర్యాలు ఇతర వసతులు కల్పిస్తున్నాం
ప్ర: కొవిడ్-19 మూలంగానే మలక్‌పేట్ నుంచి వచ్చి తాత్కాలిక వ్యాపారం నిర్వహించారు. అక్కడ మార్కెట్ పెరగడం వల్ల వెళ్లిపోయారని ప్రచారం సాగుతోంది?
జ: మార్కెట్ యార్డ్‌లో ఉల్లి వ్యాపారం చేసుకునేందుకు తాత్కాలికంగా వచ్చారన్నది వాస్తవమే. తొలుత 13 లారీల్లో ఉల్లి వచ్చింది. ప్రస్తుతం అదే కొద్దిగా తగ్గి 8 లారీల్లో వస్తుంది. అంతేకాక పెద్ద ఎత్తున వ్యాపారం ఇక్కడ నిర్వహించేందుకు దాదాపు 40 మంది వరకు సిద్ధంగా ఉన్నారు.
ప్ర: పటాన్చెరు మార్కెట్‌కు శాశ్వతంగా మలక్‌పేట్ నుంచి ఉల్లి మార్కెట్ వచ్చే అవకాశం ఉందా?
జ: అన్ని విధాలుగా పటాన్చెరు మార్కెట్ యార్డ్‌కు మలక్‌పేట్ వ్యాపారులు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. పటాన్‌చెరుకు ఓ పక్క బాహ్య వలయ రహదారి ఉండటం వల్ల వాహనాల రాకపోకలకు అనువుగా ఉంటుంది. రూ. 62 కోట్ల నా నాబార్డు నిధులు కోరడం జరిగింది. అవి మంజూరైయితే ఒక ప్రత్యేక ప్రాజెక్టు రూపంలో అభివృద్ధి చేయనున్నాం. బ్యాంకు, ఆసుపత్రి, హోటల్ ఇతర సౌకర్యాలు అన్ని ఆ ప్రాజెక్టులో సమకూరుతున్నాయి. ఉల్లి మార్కెట్ శాశ్వతంగా వస్తే వేలమందికి ఉపాధి దొరుకుతుంది.
ప్ర: పటాన్చెరు మార్కెట్ యార్డ్‌లో హమాలీలు కొరత ఉంది. ఉల్లి ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు కూడా లేవని ఉల్లి వ్యాపారులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
జ: హమాలీల కొరత ఉన్న మాట వాస్తవం. కానీ అనుకున్నంతగా లేదు. ఇప్పటికే ముగ్గురు జట్టు యాజమానులు మేము చేస్తామంటూ ముందుకు వచ్చారు. మరో పదిరోజుల్లో కొరత తీరనుంది.
ప్ర: ఉల్లి మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లు కూడా ఇక్కడికి తరలిస్తామని గతంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. ఏమేమి ఏర్పాటు చేయనున్నారు?
జ: ఉల్లితో పాటు కూరగాయలు, ఫిష్, మటన్ మార్కెట్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నాం.
ప్ర: మార్కెట్ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ఏమిటి?
జ: మార్కెట్ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులైంది. ఈ సమయంలో రైతులు, వ్యాపారులు వద్దకెళ్లి వారికి కావాల్సిన సౌకర్యాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా.
ఇదీ చూడండి : ఫేస్బుక్లో మునిగిపోతున్నారా..! మీరు బుక్కైనట్టే..!