ప్రభుత్వ అధికారులు అక్రమంగా ఆస్తులు సంపాదించినా... లంచాలు డిమాండ్ చేసినా తమను ఆశ్రయించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని ఉపఖజానా కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సంగమేశ్వర్ నుంచి 8 వేలు లంచం తీసుకుంటూ ఖజానా అధికారి దేవేందర్, సీనియర్ అకౌంటెంట్ జయప్రకాశ్‌లు పట్టుబడ్డట్లు ఆయన తెలిపారు. పుల్కల్ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు సంగమేశ్వర్ ఇటీవల పదవీ విరమణ పొందారు. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బెనిఫిట్ కోసం జోగిపేట ఉప ఖజానా కార్యాలయంలోని ఎస్టీవో దేవేందర్, సీనియర్ అకౌంటెంట్ జయప్రకాశ్‌లను ఆయన కలిశారు. 10 వేలు ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయగా... తాను ఉపాధ్యాయుడినని అంత ఇవ్వలేనని బతిమిలాడగా ఎనిమిది వేలు ఇవ్వాలని చెప్పారు. అతడు అధికారులకు డబ్బులు ఇవ్వడం ఇష్టంలేక గత శుక్రవారం సంగారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు వల పన్ని ఎస్టీవో దేవేందర్, సీనియర్ అకౌంటెంట్ జయప్రకాశ్‌లను పట్టుకున్నారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్ లోపల 'టిక్‌టాక్' చేస్తే అంతేమరి...!