Electric Vehicle Manufacturing Industry in Telangana: ఆసియాలోనే అతి పెద్ద ట్రాక్టర్ల ఉత్పత్తి పరిశ్రమను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా కంపెనీ.. ఇదే ప్రాంగణంలో మరో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైన మహీంద్రా.. ఇందుకోసం జహీరాబాద్‌లో రూ.వెయ్యి కోట్లతో ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహన తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతుంది. దీనికి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మూడు, నాలుగు చక్రాల బ్యాటరీ వాహనాలను తయారు చేయనున్నట్లు సమాచారం. ఈ పరిశ్రమ ఏర్పాటుతో మరో వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.
Electric Vehicle Manufacturing Industry in zaheerabad: ఇప్పటికీ మహీంద్రా, స్వరాజ్ బ్రాండ్లతో ట్రాక్టర్లను విక్రయిస్తున్న మహీంద్రా సంస్థ.. ఆటోమొబైల్ రంగంలోకి మరో బ్రాండ్‌ను పరిచయం చేయబోతుంది. తక్కువ బరువు ఉన్న ట్రాక్టర్లను ఓజా బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతుంది. ఈ బ్రాండ్ ట్రాక్టర్లను జహీరాబాద్ ప్లాంట్లోనే తయారు చేయబోతుండటం విశేషం. ఈ నూతన బ్రాండ్‌లో 40 మోడళ్లను ఒకేసారి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓజా ట్రాక్టర్లను భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఆసియాలోని పలు దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
ఇక నుంచి నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు..: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పేరిట సంగారెడ్డి జిల్లాలోని నిమ్జ్‌లో విద్యుత్తు వాహన తయారీ క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఈ ప్రాంతంలో విద్యుత్తు వాహనాల తయారీ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు సైతం చేసుకున్నాయి. అమెరికాకు చెందిన పరిశ్రమ ట్రైటాన్ రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ విద్యుత్ కార్లను తయారు చేయనుంది. వన్ మోటో అనే పరిశ్రమ సైతం రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది విద్యుత్ వాహనాల తయారీతో పాటు బ్యాటరీలను తయారు చేయనుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తయారు అవుతున్న సంగారెడ్డి జిల్లాలో ఇక నుంచి నాలుగు చక్రాల వాహనాలు సైతం తయారు కానున్నాయి.
ఇవీ చూడండి..
KTR at TS Council: 'ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రానికి రూ.5, 600 కోట్లు వచ్చాయి'
Jagdish reddy on electric vehicles: 'డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ వాహనాల సరఫరా లేదు'
సోలార్ విద్యుత్‌తో రాష్ట్రంతా వెలుగులమయం, టీఎస్ రెడ్కోతో మరిన్ని ప్రాజెక్టులు