సంగారెడ్డి జిల్లా అలియాబాద్‌లో ఔత్సాహిక రైతు శ్రీనివాస్... నాలుగేళ్లుగా డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండును... ఎలాగైనా మన దేశంలో పండించాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పరిశోధన కేంద్రాలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం సేకరించారు. దాదాపు 13 దేశాల్లో పర్యటించి పూర్తి అవగాహన పొందిన తర్వాత.... డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి విజయం సాధించారు. 'ఫీల్డ్ డే' పేరుతో శాస్త్రవేత్తలను, రైతులను తన పొలానికి ఆహ్వానించి అవగాహన కల్పించారు.
ధర ఎక్కువే
ఈ ప్రాంతానికి అనువైన, బరువు ఉండే రకాలు ఎంచుకొని పండించారు. సాధారణ పంటకు అదనంగా అన్ సీజన్‌లోనూ దిగుబడి సాధించారు. ఆ సమయంలో ధర ఎక్కువగా ఉండటంతో లాభాలు గడించినట్లు శ్రీనివాస్ తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్‌కు సంబంధించిన మార్కెటింగ్, ఇతర విషయాలను పరిశోధన సంస్థల ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించారు.
ఫీల్డ్ డే
'ఫీల్డ్ డే' కార్యక్రమానికి వివిధ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు హాజరయ్యారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలోని మొక్కలను పరిశీలించారు. 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలు ఈ తోటలకు అనుకూలమని వారు చెప్పారు. కానీ, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయని... పూర్తి అవగాహనతో సాగు చేయాలని సూచించారు.
ఆ ప్రాంతాలు అనుకూలం
10 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే ప్రాంతాలను సిఫారసు చేయం. అందులో పండించడం కష్టం. వేసవి సమయంలో మరికొన్ని సమస్యలు వస్తాయి.
అధ్యయనం అవసరం
ఈ పంట సాగు చేయటం ప్రారంభించినపుడు కిలోకి రూ.80 నుంచి రూ.90 ఉంది. ప్రస్తుతం 20 రూపాయలకు కొంటున్నారు. పురుగుల మందుల వల్ల పెట్టుబుడులు సైతం పెరిగాయి. అందువల్ల ఇలాంటి పంటలు పండించేటప్పుడు పూర్తి అధ్యయనం అవసరం.
ఇతర దేశాల సందర్శకులు
దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు నేపాల్ నుంచి ఈ క్షేత్రాన్ని చూడటానికి రైతులు తరలివచ్చారు. డ్రాగన్ తోటను చూసిన అనంతరం సాగు చేయటానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి : 25 ఏళ్లపాటు కాసే 'డ్రాగన్‌ఫ్రూట్స్' గురించి తెలుసా?