ఈనాడు-ఈటీవీ భారత్‌లలో ఇచ్చిన కథనాలకు స్పందనగా అన్నార్తులకు భరోసా దొరికింది. ఆకలి తీర్చడానికి మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. అర్థాకలితో అల్లాడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో మహారాష్ట్రకు చెందిన కూలీలు పడుతున్న ఇబ్బందులను ' ఈనాడు- ఈటీవీ భారత్'లు వెలుగులోకి తెచ్చాయి. కనీసం చిన్నారుల కోసం పాలు కూడా కొనుగోలు చేయలేకపోతున్న తీరుపై 'పాలు లేక.. పాలుపోక!' శీర్షికన ఈ నెల 28న కథనాన్ని అందించింది. తెరాస రాష్ట్ర నేత భిక్షపతి ఈ కథనాన్ని చదివి చలించిపోయారు. తన బృందంతో కలిసి బుధవారం కూలీలు నివాసముంటున్న చోటకు వచ్చారు . 70 కుటుంబాలకు సరకులు అందించారు.
ఒక్కో కుటుంబానికి 12కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు లీటరు పాలను పంపిణీ చేశారు. వీరంతా ప్రతి గుడిసె వద్దకు వెళ్లి నేరుగా అక్కడే సరకులు అందించారు. ఇప్పటికే ఈ కూలీ కుటుంబాలకు జిల్లా సంక్షేమ శాఖ , సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాలామృతం, పాలు , బియ్యం, కోడిగుడ్లు అందాయి. తమ కష్టాన్ని వెలుగులోకి తెచ్చి సాయం అందేలా చూసిన 'ఈనాడు'తో పాటు స్పందించిన దాతలకూ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్... అర్ధాకలితో అలమటిస్తున్న చిన్నారులు!