అధికారుల తప్పుతో సామాన్యులకు తిప్పలు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్ర సమీపంలో ధర్మసాగర్ భూములు ఉన్నాయి. అవి 242 ఎకరాల్లో బిళ్లదకలు భూములుగా ఉన్నట్లు అధికారులు 2017లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే 1978 ముందు బిళ్లదకలుగా ఉన్న ఈ భూములను అప్పటి రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కొందరికి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేసి ఇచ్చారు. అప్పటి నుంచి 2017 వరకు వందకు పైగా కుటుంబాలు ఆ భూముల్లో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. 2017లో ఒక్కసారిగా ఆ భూములు ప్రభుత్వానివి అని తెలియడంతో నిర్ఘాంతపోయారు. గతంలో భూమి కొన్నవారు నిర్మాణ పనులు చేపడుతుండగా అధికారులు అడ్డుకొని కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. దీనితో భూమి కోసం కోర్టుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధితులు స్పష్టం చేశారు. బాధితులు ఆందోళన చేయడం వల్ల తహసీల్దార్ సరస్వతి అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ధర్మసాగర్ భూములకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని ఆమె తెలిపారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకి సామాన్యులు అవస్థలు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇవీ చూడండి:పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం