విస్తారంగా కురిసిన వర్షాలతో చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం అయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పొలాలు నీట మునిగాయి. కోతకి వచ్చిన పంట జలమయవడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో కంగ్టి, నారాయణ ఖేడ్, మనూరు, సిర్గాపూర్ మండలాల్లో పంటలకు అతివృష్టితో తీవ్ర నష్టం వాటిల్లింది.
వేల ఎకరాల్లో నష్టం
కోతకు వచ్చిన సోయా పైరు దెబ్బతిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏపుగా పెరిగి పూత దశలో ఉన్న పత్తి పంటలో నీరు చేరి వేర్లు కుళ్లి పోయాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. సోయా పైరు కోతకు ముందే మొలకెత్తింది. పత్తి, కంది, సోయా, మినుము, చెరుకు, వరి పంటలు దెబ్బ తిన్నాయి. అధిక వర్షాలకు డివిజన్ పరిధిలోని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ఇదీ చదవండి: 17 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు